వంశీ డైరెక్ట్ చేసిన క్లాసిక్ థ్రిల్లర్ 'అన్వేషణ' షూటింగ్‌లో కొంత భాగం మద్రాస్‌లోని అడయార్ ప్రాంతంలో ఉన్న స్నేక్ పార్క్ వెనుకవున్న అడవిలో జరిపారు. ఆ సినిమాలో శుభలేఖ సుధాకర్ ఒక పిచ్చోడి పాత్ర ధరించారు. సగం సగం పెరిగి చిందరవందరగా ఉండే జుట్టు, బాగా మాసి సంస్కారంలేని గడ్డం, మెడలో ఒక తాయెత్తు, చిరిగిపోయిన నిక్కరు, చొక్కాతో కనిపిస్తారు. ఆ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా గెడ్డాలు, మీసాలు పెంచారు.
అంతకుముందు ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొని పదిహేను రోజులైంది. అందుకని పిచ్చోడి గెటప్‌లో ఎలా నడిచారో, ఎలాంటి మేనరిజమ్స్ చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ.. అదే మేనరిజమ్స్, నడక ప్రాక్టీస్ చేద్దామని షూటింగ్ స్పాట్ నుంచి కొంతదూరం నడుస్తూ వెళ్లారు. అక్కడ ఒక గూర్ఖా ఆయన్ను చూసి "ఏయ్.. ఎవరు నువ్వు?" అని వెనక నుంచి భుజంమీద చెయ్యివేసి కాలర్ పట్టుకున్నాడు.
"నేను సినిమా యాక్టర్‌ని. ఇక్కడ షూటింగ్ జరుగుతున్న సినిమాలో నటిస్తున్నా. షూటింగ్ కోసం వచ్చాను." అని చెప్పారు సుధాకర్. ఆ గూర్ఖా నమ్మలేదు. "ఏంటీ.. నువ్వు సినిమా యాక్టర్‌వా? ఏదీ మొహం.. నీలాంటి పిచ్చోళ్లని చాలామందిని చూశాను. వెళ్లు వెళ్లు.. బయటకు వెళ్లు." అని గేటు బయటకు పంపేయడానికి ప్రయత్నించాడు, చొక్కా కాలర్ పట్టుకొని.
"నేను పిచ్చోడ్ని కాదు బాబోయ్. ఈ సినిమాలో నాది పిచ్చోడి వేషం.." అని ఎంత చెప్పినా ఆయన మాట వినలేదు గూర్ఖా.
షాట్‌కు టైమైపోతోంది. ఆ గూర్ఖా సుధాకర్‌ను వదలడం లేదు. ఉదయం ఏడున్నర గంటలకే లొకేషన్‌కు వచ్చినవాడ్ని తొమ్మిదైనా స్పాట్‌కు వెళ్లకపోవడంతో డైరెక్టర్, కెమెరామన్ ఇతర యూనిట్ సభ్యులు సుధాకర్ కోసం వెతకడం ప్రారంభించారు. ఆలోగా మేకప్ చీఫ్, కాస్ట్యూమ్స్ చీఫ్, ఇంకా కొంతమంది యూనిట్ మెంబర్స్ ఆయన ఉన్నచోటుకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి ఆ గూర్ఖాకు నచ్చచెప్పాలని ఎంతగానో ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. చివరకు ఆ చిత్ర నిర్మాత వచ్చి గూర్ఖాకు నచ్చచెప్పి, అతని బారి నుంచి సుధాకర్‌ను విడిపించారు.
ఆ రోజు జరిగిన ఆ సంఘటన తలచుకుంటే ఒకవిధంగా ఆయనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే తను వేసుకున్న పిచ్చివాడి వేషం నిజంగా ఆయన పిచ్చివాడే అనే భ్రమలో ఆ గూర్ఖాని ముంచేసిందంటే.. అంత సహజంగా ఆ మేకప్ కుదిరిందన్న మాట అనిపిస్తుంది ఆయనకు.